Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

1 కొరింథీయులకు 1వ అధ్యాయము

1  దేవుని చిత్తమువలన యేసు క్రీస్తు1యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును 
2  కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించు వారికందరికిని (శుభమని చెప్పి ) వ్రాయునది. 
3  మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగుగాక. 
4  క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
5-6. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్తోపదేశములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతిరి; 
7  గనుక ఏ కృపావరమునందును లోపములేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతకొరకు ఎదురుచూచుచున్నారు. 
8  మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును. 
9  మన ప్రభువైన యేసుక్రీస్తను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. 
10  సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక యేకమనస్సుతోను ఏకతాత్పర్యముతోను మీరు సన్నద్ధులైయుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తుపేరట మిమ్మును వేడుకొనుచున్నాను. 
11  నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయే యింటివారివలన నాకు తెలియవచ్చెను. 
12  మీలో ఒకడు - నేను పౌలువాడను, ఒకడు - అపొల్లోవాడను, మరియెకడు - నేను కేఫావాడను, ఇంకొకడు - నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. 
13  క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మముపొందితిరా? 
14-15. నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పుకును గాయియుకును తప్ప మరి ఎవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
16  స్తెఫను ఇంటివారికి బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. 
17  బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. 
18  సిలువనుగూర్చిన వార్త నశించుచున్నవారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 
19  ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతునుఅని వ్రాయబడియున్నది. 2
20  జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు3తర్కవాది యేమయ్యెను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా? 
21  దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెర్రితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. 
22  యూదులు సూచక్రియలు చేయుమని అడుగుచున్నారు, హేల్లేనీయులు జ్ఞానము వెదకుచున్నారు. 
23  అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 
24  ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడుగాని యూదులకేమి హెల్లేనీయులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు. 
25  దేవుని వెర్రితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది. దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది. 
26  సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతినిజ్ఞానులైనను ఘనులైనను కులీనులైనను అనేకులు పిలువబడలేదు గాని 
27-29. ఏ శరీరియు దేవునియెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థముచేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. 
30  అయితే ఆయనమూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. 
31  అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవునిమూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయెను. 
    Download Audio File

1 కొరింథీయులకు 2వ అధ్యాయము

1  సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతోగాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. 
2  నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీమధ్యనెరుగకుందునని నిశ్చయించుకొంటిని. 
3  మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్దనుంటిని. 
4-5. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని, నేను మాటలాడినను (సువార్త ) ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దుష్టాంతములనే వినియోగించితిని. 
6  పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక2జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని 
7  దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 
8  అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమాస్వరూపియుగు ప్రభువును సిలువవేయక పోయియుందురు. 
9  ఇందునుగూర్చిదేవుడు తన్ను ప్రేమించువారకొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికివినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదుఅని వ్రాయబడియున్నది. 3
10  మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. 
11  ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనష్యాత్మకే గాని మనుష్యలలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగాని మరి ఎవనికిని తెలియవు. 
12  దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవునియొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 
13  మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మసంబంధమైన సంగతులను ఆత్మసంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటినిగూర్చియే మేము బోధించుచున్నాము. 
14  ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి; అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 
15  ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింపబడడు. 
16  ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు?మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము. 
Download Audio File

1 కొరింథీయులకు 3వ అధ్యాయము

1  సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీరసంబంధులైన మనుష్యలే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసి వచ్చెను. 
2  అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా? 
3  మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీరసంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా? 
4  ఒకడు - నేను పౌలువాడను, మరియొకడు - నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు (ప్రకృతిసంబంధులైన ) మనుష్యులు కారా? 
5  అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులేగదా. ఒక్కక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి 
6  నేను నాటితిని, అపొల్లో నీళ్లుపోసెను, వృద్ధికలుగజేసినవాడు దేవుడే 
7  కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లుపోయువానిలోనైనను ఏమియు లేదు. 
8  నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతివాడును తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. 
9  మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుడు (కట్టు ) గృహమునై యున్నారు. 
10  దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని, మరియొకడు దానిమీద కట్టుచున్నాడు; ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. 
11  వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే. 
12-13. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము వెండి వెలగల రాళ్లు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయొడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును 
14  పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును. 
15  ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. 
16  మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 
17  ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వాని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరును పరిశుద్ధులై యున్నారు. 1
18  ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. 
19  ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. 
20  - జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును2; మరియు-జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియును3అని వ్రాయబడియున్నది. 
21  కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. 
22  పౌలైనను అపొల్లోయైనను కేఫాయైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. 
23  మీరు క్రీస్తువారు; క్రీస్తు దేవునివాడు. 
Download Audio File

1 కొరింథీయులకు 4వ అధ్యాయము

1  ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. 
2  మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము. 
3  మీ చేతనైనను ఏ మనుష్యునిచేతనైనను4నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను. 
4  నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. 
5  కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చుపర్యంతము, దేనిగూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును. 
6  సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నామీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను. 
7  ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగినవాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల? 
8  ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మీరు రాజలైతే నాకు సంతోషమే; అప్పుడు మేమును మీతోకూడ రాజులమగుదుము గదా? 
9  మరణదండనకు విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగానున్నాము. 
10  మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము. 
11  ఈ గడియవరకు ఆకలిదప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము; 
12  స్వహస్తములతో పని చేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము; 
13  దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇదివరకు ఎంచబడియున్నాము. 
14  మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుట కీమాటలు వ్రాయుచున్నాను. 
15-16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తుయేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
17  ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమొథెయును మీయొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును. 
18  నేను మీయెద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు. 
19  ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి ఉప్పొంగుచున్నవారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును. 
20  దేవునిరాజ్యము మాటలతో కాదు శక్తితోనే యున్నది. 
21  మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయెద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా? 
Download Audio File

1 కొరింథీయులకు 5వ అధ్యాయము

1  మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. 
2  ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నరే గాని మీరెంతమాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసినవానిని మీలోనుండి వెలివేసినవారు కారు. 
3  నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండినట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను. 
4-5. ఏమనగా, ప్రభువైన యేసుదినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై, 1మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడివచ్చినప్పుడు, అట్టివానిని సాతానుకు అప్పగింపవలెను. 
6  మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? 
7  మీరు పులిపిండి లేనివారు గనుక కొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను 
8  గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియనిరొట్టెతో పండుగ ఆచరింతము. 
9  జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. 
10  అయితే ఈ లోకపు జారలతోనైనను లోభులతోనైనను దోచుకొనువారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా? 
11  ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను. 
12  వెలుపటివారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపటివారికి దేవుడే తీర్పు తీర్చును గాని 
13  మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి. 
Download Audio File

1 కొరింథీయులకు 6వ అధ్యాయము

1  మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్దులయెదుట గాక అనీతిమంతుల యెదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? 
2  పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 
3  మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యొరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా? 
4  కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?2
5  మీకు సిగ్గురావలెనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? 
6  అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. 
7  ఒకనిమీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా? 
8  అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు. 
9  అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను 
10  దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 
11  మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 
12  అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను. 
13  భోజనపదార్థములు కడుపుకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు ప్రభువు నిమిత్తమే; మనలను కూడ తన శక్తివలన లేపును. 
14  దేవుడు ప్రభువును లేపెను; మనలనుకూడ తన శక్తివలన లేపును. 
15  మీ దేహములు క్రీస్తుకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా?అదెంతమాత్రమును తగదు. 
16  వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా?- వారిద్దరు ఏకశరీరమై యుందురు3అని (మోషే ) చెప్పుచున్నాడు గదా? 
17  అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు. 
18  జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 
19  మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, 
20  విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 
Download Audio File

1 కొరింథీయులకు 7వ అధ్యాయము

1  మీరు వ్రాసినవాటి విషయమై నేను చెప్పునదేమనగా - స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. 
2  అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి స్వభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి స్వభర్త యుండవలెను. 
3  భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. 
4  భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారములేదు; ఆలాగున భార్యకు తన దేహముపైని అధికారములేదు; ఆలాగున భార్యకేగాని భర్తకు తన దేహముపైని అధికారములేదు. 
5  ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతిచొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపొయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి. 
  6-7. ఇది నా హితోపదేశమేగాని1ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు. 
8  నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్లతోను చెప్పుచున్నాను. 
9  అయితే మనస్సు నిలుపలేనియొడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుటకంటె పెండ్లిచేసికొనుట మేలు. 
10  మరియు పెండ్లియైనవారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. 
11  ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. 
12  ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పునదేమనగా - ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య కలిగియుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. 
13  మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్త కలిగియుండి, ఆమెతో కాపురము చేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు. 
14  అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి2పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. 
15  అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకే దేవుడు మనలను3పిలిచియున్నాడు. 
16  ఓ స్త్రీ, నీకేమి తెలియును? నీ భర్తను రక్షించెదవేమో. పురుషుడా, నీకేమి తెలియును? నీ భార్యను రక్షించెదవేమో 
17  అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. 
18  సున్నతి పొందినవాడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు. 
19  దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే (ముఖ్యముగాని ) సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమియు లేదు. 
20  ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనేయుండవలెను. 
21  దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెకడల, స్వతంత్రుడవగుట మరి మంచిది. 4
22  ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. 
23  మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. 
24  సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో (సహవాసము కలిగి ) ఉండవలెను. 
25  కన్యకల విషయమై ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువువలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. 
26  ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను. 
27  భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు. 
28  అయినను నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసికొనినను ఆమెకు పాపము లేదు; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను. 
29  సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును 
30  ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును 
31  ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 
32  మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచున్నాడు. 
33  పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటినిగూర్చి చింతించుచున్నాడు. 
34  అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్లయి యుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటినిగూర్చి చింతించుచున్నది. 
35  మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. 
36  అయితే ఒకని కుమార్తెకు1 ఈడుమించిపోయిన పక్షమందును, ఆమెకు వివాహము చేయవలసివచ్చిన పక్షమందును, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడల, అతడు తన యిష్టముచొప్పున చేయవచ్చును; అందులో పాపము లేదు, పెండ్లిచేసికొన వచ్చును గాని 
37  యెవడైనను తన కుమార్తెకు1పెండ్లిచేయనవసరములేక యుండి అతడు స్థిరచిత్తుడును, తన ఇష్టప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచన్నాడు. 
38  కాబట్టి తన కుమార్తెకు1పెండ్లిచేయువాడు బాగుగ ప్రవర్తించుచున్నాడు, పెండ్లిచేయనివాడు మరి బాగుగా ప్రవర్తంచుచున్నాడు. 
39  భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలై యుండును, భర్త మృతిపొందినయెడల ఆమెకిష్టమైనవాని పెండ్లిచేసికొనుటకు స్వతంత్రురాలై యుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను. 
40  అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను. 
Download Audio File